Wednesday

తెలంగాణ‌లో 40 కొత్త న‌గ‌రాలు ఏర్పాటుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 కొత్త మునిసిపాలిటీల ఏర్పాటుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఉన్న కొత్త న‌గ‌రాల‌కు తోడుగా వీటి శివారు గ్రామాల న‌గ‌రాల‌ను, పంచాయతీల‌ను కూడా విలీనం చేయ‌నున్నారు. పెరిగిన జ‌నాభా, ఆదాయ‌పు ప‌న్నును ఆధారం చేసుకుని మునిసిపాలిటీ సంఖ్య‌ను పెంచ‌డంతో పాటు, వీటి గ్రేడ్ల‌ను కూడా పెంచ‌నున్నారు. తెలంగాణ‌లో గ‌తేడాది రాష్ట్ర ప్ర‌భుత్వం జిల్లాల సంఖ్య‌ను 10నుంచి 31కు పెంచిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు మునిసిపాలిటీల‌ను పెంచేందుకు రెడీ అవుతోంది.  2011 జనాభా లెక్కల ప్రకారం 20 వేలు, ఆపై జనాభా గల గ్రామ పంచాయతీలకు సైతం మునిసిపాలిటీ హోదా కల్పించ‌నున్నారు.


అలాగే మ‌రో లెక్క కూడా ఉంటుంది. 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం 20 వేలు, ఆపై జ‌నాభా ఉండ‌డంతో పాటు ఈ జ‌నాభాలో సంగం మంది వ్య‌వ‌సాయేత‌ర రంగంలో ఉపాధి పొందుతూ ఉంటేనే ఆ గ్రామ పంచాయ‌తీని మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా  40 గ్రామ పంచాయతీలకు మునిసిపాలిటీ హోదా ఇవ్వవచ్చని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. జిల్లా కేంద్ర‌మైన న‌ల్గొండ మునిసిపాలిటీ హోదా పెరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మునిసిపాలిటీకి ఫ‌స్ట్ గ్రేడ్ హోదా ఉండ‌గా, ఇప్పుడు దీనిని స్పెష‌ల్ గ్రేడ్ హోదాకు పెంచుతున్నారు.

కొత్తగా జిల్లా కేంద్రంగా ఏర్పడిన నాగర్‌ కర్నూల్ న‌గ‌ర పంచాయ‌తీని మునిసిపాలిటీగా, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాన్ని కూడా మునిసిపాలిటీగా పెంచ‌నున్నారు. ఇక మ‌రో జిల్లా కేంద్ర‌మైన సంగారెడ్డి మునిసిపాలిటీలో 11 గ్రామ పంచాయ‌తీలు, బోధ‌న్ మునిసిపాలిటీలోను శివారు గ్రామాల విలీనం, తాండూరు మునిసిపా లిటీ పరిధి పెంపు, ఆందోల్‌– జోగిపేట్‌ నగర పంచాయతీలో  6 గ్రామాలు, సదాశివపేట మునిసిపాలిటీలో 13 గ్రామాలు, జహీరాబాద్‌ మునిసిపాలిటీలో 15 గ్రామాల విలీనం ప్రతిపాదనలు ఉన్నాయి. షాద్‌నగర్‌ మునిసిపాలిటీ హోదాను గ్రేడ్‌–2గా పెంచనున్నారు.

ఇక కొత్త పంచాయ‌తీల ప్ర‌తిపాద‌న‌లు ఇలా ఉన్నాయి… 

బాన్సువాడ (కామారెడ్డి) – చేర్యాల(సిద్దిపేట) – తొర్రూరు(రంగారెడ్డి) – నర్సాపూర్‌ (మెదక్‌) – మరిపెడ(మహబూబాబాద్) – నారాయణ్‌ ఖేడ్‌(సంగారెడ్డి) – రామాయంపేట (మెదక్‌) – బొల్లారం(సంగారెడ్డి) – నిజాంపేట(రంగారెడ్డి) – ఆసిఫాబాద్‌ (కుమ్రం భీం ఆసిఫాబాద్‌) – డోర్నకల్‌ (మహబూబాబాద్‌) – మద్దూరు (మహబూబ్‌నగర్‌) – కోస్గి (మహబూబ్‌నగర్‌) – ధర్మపురి (జగిత్యాల) – తూఫ్రాన్‌(మెదక్‌) గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేస్తారు.

0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Follow us

Powered by Blogger.